Chiranjeevi - Balakrishna - Venkatesh: మే 2021 కోసం అభిమానుల వెయిటింగ్.. కారణం ఇదే.!.

jfe news 

Chiranjeevi - Balakrishna - Venkatesh: ఒకేసారి రెండు మూడు భారీ సినిమాలు వస్తే పండగ చేసుకుంటారు అభిమానులు. నచ్చిన హీరోల నుంచి ఒక్క సినిమా వచ్చినా ఇప్పుడు మహా ప్రసాదమే. ఎందుకంటే గతేడాది మొత్తం కరోనా పేరుతో బలైపోయింది.



ఒకేసారి రెండు మూడు భారీ సినిమాలు వస్తే పండగ చేసుకుంటారు అభిమానులు. నచ్చిన హీరోల నుంచి ఒక్క సినిమా వచ్చినా ఇప్పుడు మహా ప్రసాదమే. ఎందుకంటే గతేడాది మొత్తం కరోనా పేరుతో బలైపోయింది కాబట్టి 2021 అంతా సినిమా పండగ చేసుకోవాలని ఫిక్సయ్యారు దర్శక నిర్మాతలు. అందుకే వరస సినిమాలు విడుదల చేస్తున్నారు.. విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. 2021లో దాదాపు 30 భారీ సినిమాలు విడుదల కానున్నాయి. సీజన్.. అన్ సీజన్ అని తేడా లేకుండా అన్ని నెలలలో సినిమాలు విడుదలవుతున్నాయి. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని తేదీలపై కూడా నిర్మాతలు ఖర్చీఫ్ వేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మే 2021 మాత్రం ప్రత్యేకంగా మారిపోయింది సినిమా ఫ్యాన్స్‌కు. ఈ ఒక్క నెల కోసం అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా వేచి చూస్తుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే మే నెలలో ముగ్గురు సీనియర్ హీరోలు 15 రోజుల గ్యాప్‌లో వస్తున్నారు. 2001లో సంక్రాంతికి ఈ చిత్రం జరిగింది. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు 2021 మేలో జరగబోతుంది. ఒకే నెలలో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ చాలా అరుదుగా వచ్చారు. 2001 సంక్రాంతికి ఒక్కరోజు గ్యాప్‌లో మృగరాజు, నరసింహనాయుడు, దేవీపుత్రుడు విడుదలయ్యాయి. అందులో నరసింహనాయుడు రికార్డులు తిరగరాసింది.

ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఈ ముగ్గురు ఒకే నెలలో రాలేదు. అలాంటి చిత్రం ఇప్పుడు మేలో జరగబోతుంది. చిరంజీవి ఆచార్య.. వెంకటేష్ నారప్ప.. బాలయ్య, బోయపాటి సినిమాలు మే నెలలో విడుదల కానున్నాయి. మే 13న చిరంజీవి ఆచార్య.. మే 14న నారప్ప.. మే 28న బాలయ్య సినిమాలు విడుదల కానున్నాయి. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలయ్య సినిమా విడుదల కానుంది. మరోవైపు వరస రోజుల్లో చిరు, వెంకటేష్ వస్తున్నారు.

దాంతో మెగా, నందమూరి, దగ్గుబాటి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ మూడు సినిమాల్లో ఆచార్యపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరోవైపు బాలయ్య సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక తమిళంలో సంచలనం సృష్టించిన అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాపై ఆసక్తి బాగానే ఉంది. అలా మొత్తానికి మే నెల అంతా సీనియర్ హీరోల సందడి కనిపించనుంది.


Comments